నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత||
నా బాల్యమంతా నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి తప్పించినావు
యవ్వనకాలమున నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత||
కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హృదయాశలన్ని నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ ||నా జీవిత||